Andhra PradeshNews

అనుకూల తీర్పువస్తే త్వరలో విశాఖ రాజధాని?

◆ మూడు రాజధానుల అంశంపైనే నేడు సుప్రీంకోర్టులో విచారణ
◆ సుప్రీంకోర్టులో వాదనలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న ప్రభుత్వం
◆ నాలుగు వాల్యూమ్ లు, 1800 పేజీలతో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్

ఏపీలో మూడు రాజధానుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో మూడు రాజధానుల అంశం చివరి ఘట్టానికి చేరుకుందని చెప్పవచ్చు. మూడు రాజధానుల ఆవశ్యకతను వివరిస్తూ హైకోర్టు తీర్పును పరిశీలించాలని కోరుతూ నాలుగు వాల్యుంలు, 1800 పేజీలతో సుప్రీం కోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ మీద విచారణ జరిగి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే క్షణమైనా ఆలస్యం చేయకుండా విశాఖ రాజధాని అవుతుంది. అంతకుముందు అమరావతి పరిరక్షణ సమితి వేసిన కేవియట్ పిటిషన్తోపాటు ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పి పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరుపనుంది. రాష్ట్ర విభజన నాటి నుంచి రాజధాని నిర్ణయం వరకు గత 8 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం ఎస్ఎల్పీలో వివరించనుంది. విభజన సమయంలో రాజధానిగా అభివృద్ధి చెందిన హైదరాబాదును కోల్పోయిన నేపథ్యంలో పట్టణాలు నగరాల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా అమరావతిలో శాసన, విశాఖపట్నంలో పాలన, కర్నూలులో న్యాయ రాజధానులు ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందని అందులో వివరించింది.

అమరావతిని ప్రపంచ స్థాయిలో రాజధానిగా అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల మేర నిధులు ఖర్చు చేయాల్సింది ఉందని ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో అన్ని నిధులు కేంద్రీకరించటం వలన ఇతర ప్రాంతాలపై ఆ ప్రభావం చూపుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మూడు రాజధానులను అభివృద్ధి చేయటం ద్వారా సమతుల్యతతో పాటు విస్తృత ప్రజా ప్రయోజనాలను నెరవేర్చినట్లు అవుతుందనేది తమ భావనగా ఎస్ఎల్పీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజధానిపై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయం అనే అంశాన్ని ప్రభుత్వం సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తుంది. ఎలా అయినా సుప్రీంకోర్టులో ప్రభుత్వం గెలవాలని తలంపుతో అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఈరోజు జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తుందో అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. తీర్పు అనుకూలంగా వస్తే పరిపాలనను విశాఖపట్నం కు వెంటనే మార్చే విధంగా జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.