ఏపీలో రాజకీయ ఉగ్రవాదులపాలన పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న పాలకులకు పెద్ద స్థాయి అధికారులు వంగి వంగి సలాం చేస్తుంటే చెప్పు చూపించక ఏమి చూపించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇంట్లోనే ఆడవాళ్ళని రేప్ చేసి చంపేస్తాం అంటున్న వారికి పాలకులు గులాం కొడుతుంటే తిరగబడక ఇంకేం చేస్తామని ఒక సామాన్యుడి గుండె ఎంత మండిపోతుందో ఆలోచించాలని అన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం ఘటనలో అక్రమ కేసులు ఎదుర్కొన్న జనసైనికులు, పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము రాష్ట్రంలో ఎక్కడికి రావాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో మీరే నిర్దేశిస్తే ప్రజాస్వామ్యం ఉన్నది ఎందుకని నిలదీశారు.

రాజ్యాంగం మనకు సాధికారత ఇచ్చిందని దానిని ఎప్పుడూ అతిక్రమించవద్దని హితవు చెప్పారు. ఏపీలో రాజకీయ ఉగ్రవాదుల పాలన కొనసాగుతుందని విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర విధ్వంసం చేయాలని వైసీపి చూస్తుందని అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలను సృష్టించాలని ప్రయత్నాలు చేస్తుందని వివాదాల సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. న్యాయపరమైన అంశాల పట్ల జనసేన పార్టీ నాయకులు శ్రేణులు కచ్చితంగా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని వ్యవస్థల్లో బలమైన మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఈ ప్రయాణంలో ఎందరో తనకు అండగా నిలిచారని విశాఖ ఘటనతో మనం ఎంత సంఘటితంగా ఉన్నాము బలమైన పోరాటాలు ఎలా చేయగలమో అర్థం అయిందన్నారు. ప్రజా పోరాటాలను నిర్మించుకుందామని అధికార పార్టీ దురాగతాల మీద సంఘటితంగా పోరాడదాం అని స్థానికంగా ఉండే ప్రతి సమస్యను గుర్తించాలని పార్టీకి మద్దతుదారులను కూడగట్టాలని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికబద్ధంగా పనిచేద్దామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

