NewsTelangana

చండూరులో రేపు కేసీఆర్‌ సభ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదివారం చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొయినాబాద్‌ పాంహౌస్‌లో ‘టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర’ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించాలని కేసీఆర్‌ తొలుత నిర్ణయించారని వార్తలొచ్చాయి. అయితే.. తర్వాత రూటు మార్చి.. ‘ఎమ్మెల్యేలకు ఎర’ వివాదంపై చండూరు సభలోనే బీజేపీని ఎండగట్టాలని ప్లాన్‌ చేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎమ్మెల్యేలకు ఎర’ వివాదానికి సంబంధించి ఆడియో, వీడియో టేపులు సోషల్‌ మీడియాలో వ్యాపించడంతో బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిందని టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నారు.

ముందస్తుకు వెళ్తారా..?

ఎమ్మెల్యేల అక్రమాస్తులకు సంబంధించి కూడా కేసీఆర్‌ చండూరు సభలో మాట్లాడతారని తెలుస్తోంది. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలిస్తే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు వార్తలందుతున్నాయి. అక్కడ ఓడిపోతే మాత్రం అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరిగే అవకాశం ఉంది. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ ఘటన తర్వాత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీకి మేలు జరుగుతుందన్న ఆశాభావంలో కేసీఆర్‌ ఉన్నారు. నిజానికి ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రారంభించాలని కేసీఆర్‌ తొలుత భావించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం బయట పడటంతో వ్యూహం మార్చారని టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు.