NationalNews

మళ్లీ వడ్డీ రేట్ల బాదుడుకు ఆర్బీఐ ప్లాన్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మరో సారి వడ్డీ రేట్ల బాదుడుకు ప్లాన్‌ చేస్తోంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాన్ని షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 5-7 తేదీల్లో జరపాలి. కానీ ఈసారి గడువుకు ముందుగానే నవంబరు 3వ తేదీన నిర్వహించేందుకు ఆర్బీఐ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కఠిన చర్యలు తీసుకున్నా ద్రవ్యోల్బణం పెరగడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ సమస్యలపై చర్చించి భారత ఆర్థిక, వాణిజ్య వృద్ధికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా సమావేశం జరుగుతుందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.

పెరగనున్న గృహ, వాహన వడ్డీ రేట్లు..?

ద్రవ్యోల్బణం పెరగడం, రూపాయి పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో పాటు విదేశీ చెల్లింపులు మరింత భారంగా మారనున్నాయి. అందుకే రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు)ను పెంచక తప్పదని ఆర్బీఐ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే పలుసార్లు పెంచడం ద్వారా 5.9 శాతానికి చేరుకున్న రెపో రేటును మరింత పెంచాలని ఆర్బీఐ భావిస్తోంది. అదే జరిగితే బ్యాంకులు కూడా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెంచుతాయి. చివరికి అది సామాన్యుల నడ్డి విరిచే పరిస్థితికి చేరుకుంటుందని ప్రజలు భయపడుతున్నారు.