కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. తెలంగాణాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఉత్సాహపూరితంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా ఎల్లిగండ్లలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర సాయంత్రానికి మన్యం కొండ చేరుకుంది. రాహుల్ రాత్రి ధర్మాపూర్‌లో బస చేస్తారు. పాదయాత్ర సందర్భంగా రహదారి పక్కన ఉన్న స్కూలు విద్యార్థులతో రాహుల్ ముచ్చటించారు. అన్నివర్గాల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తూర్పారబట్టారు. ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాకూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నదీం జావెద్, మహేష్ కుమార్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నవంబరు ఒకటో తేదీన హైదరాబాద్ రానున్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడైన తర్వాత తెలంగాణాకు రావడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు.