Andhra PradeshNews

12న విశాఖ రైల్వేజోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన

◆ సీఎం జగన్‎తో కలిసి ప్రారంభించనున్న ప్రధాని మోదీ
◆నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటన

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే సమయం వచ్చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కొస్తా రైల్వే శంకుస్థాపన ముహూర్తం ఖరారు అయింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మూడోసారి విశాఖలో పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన రైల్వే జోన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టునున్నారు. ఇందుకోసం నవంబర్ 11న విశాఖకు ఆయన రానున్నారని అధికార వర్గాల సమాచారం. వడ్లపూడి వ్యాగన్ వర్క్ షాప్ జాతికి అంకితం చేయటంతో పాటు రూ.446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.26 వేల కోట్లతో హెచ్పీసీఎల్ విస్తరణ పనులను ప్రారంభోత్సవంతోపాటు… గంభీరంలో నిర్మించిన ఐఐఎం (వైజాగ్) భవనానికి శ్రీకారం చూడతారు. రూ.380 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రికి శంకుస్థాపన తదితర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.

నవంబర్ 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్న ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ నుండి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి ప్రధాని ముఖ్యమంత్రి చేరుకుంటారు. కాసేపు ఈఎన్.సి అధికారులతో రక్షణ రంగంతో చర్చించి రాత్రి అక్కడే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌కి చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ వేదిక నుంచి పలు కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ తో పాటు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ నేతృతంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.