NationalNews

నేడు ఢిల్లీలోనే నోరు విప్పనున్న కేసీఆర్‌

ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ కొనుగోలు వ్యవహారం బట్టబయలుకు ప్లాన్‌

ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై మాట్లాడని టీఆర్‌ఎస్‌ నాయకులు

మొయినాబాద్‌ ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై టీఆర్‌ఎస్‌ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆధారాలు లేవంటూ నిందితులను విడుదల చేయాలని కోర్టు గురువారం రాత్రి ఆదేశించింది. ఈ వివాదంపై తొలుత హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు వెల్లడించాలని భావించిన సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ మార్చారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లి హస్తినలోనే ప్రెస్‌మీట్‌ పెట్టాలని.. బీజేపీ చిట్టాను జాతీయ మీడియాలో బయట పెట్టాలని.. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయకులు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలను ఉదహరిస్తూ తెలంగాణాలో ఆ పార్టీ కుట్రను బట్టబయలు చేయాలని వ్యూహం రూపొందించారు.

మొయినాబాద్‌ ఫాం హౌస్‌లో జరిగిన వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులను కేసీఆర్‌ గురువారం పరిశీలించారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకులతో సుదీర్ఘ మంతనాలు కూడా జరిపారు. ఈ వివాదంపై పార్టీ నాయకులెవరూ స్పందించొద్దని ఆదేశించారు. అందుకే.. బీజేపీ నేతలు ఎన్ని ప్రెస్‌మీట్‌లు పెట్టినా.. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడా నోరు విప్పలేదు. ఫాం హౌస్‌లో పట్టుబడిన వారికి బీజేపీతో ఉన్న సంబంధాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం హైదరాబాద్‌ టు హస్తిన వేదికగా కొత్త మలుపు తీసుకోనుంది.

కేసీఆర్‌కు ఫోన్ల వెల్లువ..

ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం వెలుగులోకి రాగానే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తదితరులు సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు వ్యవహారాన్ని ముందే తెలుసుకున్న కేసీఆర్‌ను వారు అభినందించారు. కాగా.. అడ్డంగా దొరికిన దొంగలు మొరుగుతూనే ఉంటాయని.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ నాయకులకు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ వివాదంపై దర్యాప్తు జరుగుతున్నందున టీఆర్‌ఎస్‌ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.