ఆర్జీవీ రెండు మెరుపులు… ‘వ్యూహం’, ‘శపథం’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవర్శీకి చిరునామాగా నిలిచేలా మూవీ తీయబోతున్నాడు. ఇప్పటి వరకు అనేక బయోపిక్‌లు తీసిన ఆర్జీవీ ఇప్పుడు రాజకీయ కోణాలను స్పృశించేలా మరో మూవీతో ముందుకు రాబోతున్నట్టు ప్రకటించాడు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన ‘వ్యూహం’ కథ, రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని ప్రకటించాడు. రాచకురుపుపైనే వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి పరాకాష్ట ‘వ్యూహం’ చిత్రమంటూ చెప్పుకొచ్చారు. రెండు పార్ట్స్‌గా మూవీలో తొలి పార్ట్ ‘వ్యూహం’ అని చెప్పుకొచ్చిన ఆర్జీవీ రెండో పార్ట్ ‘శపథం’ రెండు చిత్రాల్లోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని ట్వీట్లో చెప్పుకొచ్చాడు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం ‘వ్యూహం’ నుంచి షాక్ తెరుకునే లోపే వాళ్లకి ఇంకో ఎలక్ట్రిక్ షాక్, పార్ట్ 2 ‘శపథం’ లో తగులుతుందన్నాడు. ఈ చిత్రాన్ని అంతకు ముందు తనతో వంగవీటి సినిమా తీసిన నిర్మాత దాసరి కిరణ్ నిర్మిస్తాడన్నాడు. ఎలక్షన్ టార్గెట్ గా ఈ చిత్రాన్ని తియ్యట్లేదని చెప్తే ఎవరూ నమ్మరు కనుక… ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పనక్కర్లేదని చెప్పడం లేదంటూ రాసుకొచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత రాష్ట్ర రాజకీయాలపై ఆర్జీవీ మూవీ తీస్తారని అందరూ భావించారు. అదే విషయాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఆర్జీవీ ఏపీ రాజకీయాల్లోని లోతును మూవీగా తీయబోతున్నట్టుగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఈ రెండు చిత్రాలను విడుదల చేయాలని ఆర్జీవీ భావిస్తున్నారు. పిక్‌లో వంద శాతం నిజాలే ఉంటాయని వెల్లడించారు.
