Telangana

తెలంగాణాలో బీజేపీ ఆటలు సాగవు: మంత్రులు

కేంద్రంలో సర్కారు నడిపిస్తున్న బీజేపీ అధికార దాహంతోనే ఇలాంటి కుట్రలు పన్నుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బీజేపీ ధనస్వామ్యంతో కొనుగోళ్ల పర్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణాలో బీజేపీ ఆటలు సాగవని.. బీజేపీ ప్రలోభాలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లొంగబోరని స్పష్టం చేశారు. బీజేపీ కుట్రను భగ్నం చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించొద్దని బీజేపీ నేతలకు సూచించారు. కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతోందనే భయంతోనే.. ఢిల్లీ పీఠం కదులుతుందనే ఆందోళనతోనే బీజేపీ కొనుగోళ్ల కుట్రకు తెర లేపిందని ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు ప్రలోభాలకు గురి చేసేందుకు విఫలయత్నం చేశారని మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కుట్రలకు తెలంగాణాలో చోటు లేదని.. ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలకు నిరసనగా చౌటుప్పల్‌లో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.