11న విశాఖకు మోదీ.. అక్కడే గుడ్ న్యూస్..!
ప్రధాని మోదీ నవంబరు 11వ తేదీన విశాఖపట్నం రానున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో రూ.400 కోట్లతో చేపట్టే ఆధునికీకరణ పనులతో పాటు మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఏపీ బీజేపీ నేతలతోనూ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ విశ్వభూషన్ పాల్గొంటారు. ఏపీ ప్రభుత్వం నిర్మించే భోగాపురం విమానాశ్రయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా ప్రధానితో శంకుస్థాపన చేయించాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు.

డిసెంబరులో రాష్ట్రపతి పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వివాదం, అమరావతి రాజధాని రైతుల యాత్ర, పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖలో ఉద్రిక్తత, విశాఖను రాజధాని చేయాలంటూ ఉత్తరాంధ్ర మంత్రుల రాజీనామా ప్లాన్, టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ప్రధాని పర్యటన ఆసక్తికరంగా మారనుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో ఏపీలో ప్రతిపక్షాలు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటన కీలకంగా మారనుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా డిసెంబరు 4వ తేదీన విశాఖ వచ్చి.. తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో జరిగే నౌకా దినోత్సవంలో పాల్గొంటారు.