పునీత్ రాజ్ కుమార్‌కు ‘కర్ణాటక రత్న’ ప్రధానం
కన్నడ దివంగత హీరో.. రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డునిచ్చి సత్కరించబోతోంది. గత సంవత్సరం అక్టోబరు 29న గుండెపోటుతో మరణించారు పునీత్. 45 సంవత్సరాల చిన్నవయస్సులోనే అకాలమరణం పాలయ్యారు. కన్నడనాట అతనికి అభిమానులు చాలా ఎక్కువ. ఆయన మరణాన్ని ఇంకా కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులకు ఎంతో సహాయం చేసేవారు పునీత్. ఆయన చేసిన సేవలను పునస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం నవంబరు 1 కర్ణాటక అవతరణ దినోత్సవం సందర్భంగా విధానసౌధ( శాసనసభ) ఎదుట జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయబోతోంది. మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పునీత్ కుటుంబసభ్యులతో సంప్రదించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఈ అవార్డును 2009 తర్వాత ఎవరూ అందుకోలేదని, ఇప్పటి వరకూ కేవలం 8 మందికి మాత్రమే ఈ అవార్డు దక్కిందని తెలియజేశారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. తన మంచితనంతో, సినిమాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న పునీత్ యువతకు స్ఫూర్తి దాయకమని, కన్నడ చిత్ర పరిశ్రమకు అతడు చేసిన సేవలకు గాను మరణానంతరం ఈ అవార్డును అందజేస్తున్నామని తెలిపారు. నవంబరు 1 సాయంత్రం 5 గంటలకు విధానసౌధలో అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖసాహితీ వేత్తలు, సినీ ప్రముఖులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత బెంగళురులోని వివిధప్రాంతాలలో మరో మూడు కార్యక్రమాలు పునీత్ అభిమానుల కోరిక మేరకు జరుగుతాయని సీఎం బొమ్మై తెలిపారు.

