NewsTelangana

బీజేపీకి స్వామిగౌడ్‌ రాజీనామా.. మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి..!

మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బీజేపీలోకి పొలోమని వెళ్లిన నాయకులు మళ్లీ బ్యాక్‌ టు పెవిలియన్‌ అంటున్నారు. కొంతకాలం క్రితమే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్య గౌడ్‌, దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో కీలక నేత స్వామిగౌడ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్‌గా కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన స్వామిగౌడ్‌.. దాసోజు శ్రవణ్‌తో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. బీసీల పట్ల బీజేపీ వైఖరి సరిగ్గా లేదని స్వామిగౌడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరిన స్వామిగౌడ్‌ 2014లో ఎమ్మెల్సీగా గెలిచారు. 2020లో టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన రెండేళ్లలోనే మళ్లీ సొంతగూటికి చేరనుండటం విశేషం.