Andhra PradeshNews

అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపునకు గవర్నర్ పచ్చజెండా

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన పేదలకు రాజధాని గ్రామాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రభుత్వానికి అవకాశం కలిగింది. సిఆర్‌డిఎ, మెట్రోపాలిటన్‌ రీజియన్‌, అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులకూ కేటాయించేలా కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.ఈ విషయంలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సిఆర్‌డిఎ చట్టాన్ని సవరించింది. మాస్టర్‌ప్లాన్‌లో కూడా మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. రెండేళ్ల క్రితం విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలకు చెందిన దాదాపు 54 వేల మంది పేదలకు రాజధాని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయింపునకు ప్రభుత్వం ప్రయత్నించగా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ అంశం రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది.

అయితే ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం సీఆర్‌డిఏ చట్టానికి సవరణలు చేయగా గవర్నర్‌ ఆమోదంతో మార్పునకు అవకాశం ఏర్పడింది. 54 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది, రాజధానిలో జనాభా పెరగకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అని వైసీపీ ప్రశ్నిస్తుండగా తాము రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం మురికివాడలులేని నగరంగా తీర్చిదిద్దాలని గత ప్రభుత్వ ఆలోచనగా టీడీపీ నాయకులు చెబుతున్నారు. 2015 జనవరిలో భూ సమీకరణ చేసే నాటికి ఉన్న జనాభానే ఇప్పటికీ ఉందని, ఇప్పటి వరకు జనాభా పెరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. జనాభా పెరుగుదల, ప్రజల కార్యకలపాలు పెంచడం ద్వారానే అభివృద్ధి సాధ్యమంటున్నారు. అయితే వైసిపి అంతర్‌వ్యూహం మరోలా ఉంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల వారిని రాజధానికి తీసుకురావడం ద్వారా రాజధాని గ్రామాల్లో వైసీపీ ఓటర్లను పెంచుకోవాలన్న వ్యూహం దాగి ఉందని టీడీపీ అనుమానిస్తోంది. దీంతో వారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు చట్ట సవరణ ద్వారా కొత్త వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి అవకాశం దక్కింది.