NewsTelangana

చేనేతల కంట్లో కారం కొట్టిన కేటీఆర్‌

బతుకమ్మ చీరలను చేనేత కార్మికులతో నేయిస్తా అన్న మంత్రి కేటీఆర్‌.. చేనేతల కంట్లో కారం కొట్టి.. రూ.250 కోట్లు ఖర్చు చేసి సిరిసిల్లలో మరమగ్గాల ద్వారా ప్రింట్‌ చేయించారని బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. చండూరులో గురువారం జరిగిన చేనేత సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల పవర్‌ లూమ్స్‌ ఉంటే.. సిరిసిల్లలోనే 20 వేల పవర్‌లూమ్స్‌ ఉన్నాయని చెప్పారు. సిరిసిల్లలో మినహాయిస్తే రాష్ట్రంలో ఉన్న ఏ పవర్‌లూమ్స్‌లోనూ కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ఇంతకాలం మునుగోడును పట్టించుకోని టీఆర్‌ఎస్‌ సర్కారు.. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత ఎన్నో పథకాలు ప్రకటించారని ఎద్దేవా చేశారు.

గొర్లమందపై తొడేళ్లు పడ్డాయి..

మునుగోడులో ఓటమి భయం పట్టుకున్న కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగుతున్నారని ఈటల చెప్పారు. గొర్లమందపై తొడేళ్లు పడ్డట్లు ఒక్క నియోజక వర్గంపై సీఎం కేసీఆర్‌, 80 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ ఆత్మగౌరవం కలిగిన గడ్డ అని.. ఈ గడ్డపై ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీలో చేనేతకు 5 శాతం ఉండాలని కేంద్రాన్ని కోరిన కేటీఆర్‌.. ఇప్పుడు సుద్దపూసలాగా మాట్లాడుతున్నారని ఈటల ఎద్దేవా చేశారు. 20 ఏళ్లుగా చేనేత కార్మికుల సమస్యలపై పోరాడినది ఈటల రాజేందర్‌ అని మర్చిపోవద్దని సూచించారు. వేలాదిగా తరలి వచ్చి రాజగోపాల్‌ రెడ్డిని ఆశీర్వదించిన చేనేత కార్మికులకు శుభాభినందనలు తెలిపారు.

ప్రాణం పోయినా కేసీఆర్‌ను వదిలిపెట్టను..

ప్రాణం పోయినా పర్వాలేదు.. కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదన్న నిర్ణయం తీసుకొనే బయల్దేరామని ఈటల స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో కలిసి చండూరు మండలం సిర్దపల్లి గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. అబద్ధాలను కూడా నమ్మేట్లు చెప్పడంలో కేసీఆర్‌ దిట్ట అన్నారు. ‘డబుల్‌ బెడ్‌రూం గురించి కేసీఆర్‌ ఏం చెప్పిండు..? అల్లుడు, బిడ్డవస్తే ఎలా..? కొడుకు, కోడలు ఎక్కడ పడుకోవాలి’ అని అడిగిన సీఎం ఈ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని ఈటల నిలదీశారు. కట్టే సత్తా కేసీఆర్‌కు లేదన్నారు.

మందిలో మంత్రి మందు తాగుతాడా..?

తనతో పని చేసిన మంత్రులు తెలంగాణ ఇజ్జత్‌ తీశారని ఈటల వాపోయారు. కేసీఆర్‌ చెప్పగానే గంగిరెద్దులా వచ్చి మునుగోడులో దావత్‌ ఇవ్వడం.. ఓట్లు అడగడం.. పది మందిలో మందు తాగడం ఏమిటని ప్రశ్నించారు. మీ గ్రామంలో రోడ్లు ఎందుకు వేయించలేదో ఓట్ల కోసం వచ్చే మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఉద్యోగాలు ఇప్పించారా.. ఇక్కడకు ఎందుకొచ్చారంటూ కడిగి పారేయాలన్నారు. మునుగోడు ప్రజల మీద మంత్రులకు, ఎమ్మెల్యేలకు అకస్మాత్తుగా ప్రేమ పుట్టిందా..? అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్‌ రెడ్డి అసెంబ్లీకి వస్తే తనను బతకనీయడన్న భయంతోనే కేసీఆర్‌ ఇంత మందిని పంపించారని చెప్పారు. రాజగోపాల్‌ రెడ్డి గెలుపుతో కేసీఆర్‌ ఆట ముగుస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు దమ్ము లేదు కాబట్టే ధర్మం ఆయన వైపు లేదని ఈటల చెప్పారు. ప్రాణం పోయినా పర్వాలేదు.. అక్రమ మార్గాన్ని ఎంచుకున్న కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదన్నారు.