పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వచ్చే దమ్ముందా కేసీఆర్
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. మునుగోడుకు ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పే దమ్ముందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ పనులు ఏమయ్యాయని బండి సంజయ్ నిలదిశారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రి హామీలు మర్చిపోయారని ఆయన దుయ్యబట్టారు. కమ్యూనిస్టులు సొంత పగ కోసం కార్యకర్తల పోరాటాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ ఎన్నిక రాష్ట్రంలోని పేదల భవిష్యత్‌ను మార్చేసేదని బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీకి ఓటేసి టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.