నా పొరపాట్లు మన్నించండి
లండన్, మనసర్కార్
బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ ఈమధ్య ప్రకటించిన మినీ బడ్జెట్ విమర్శలకు దారితీసింది. ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలతో పాటు సమానంగా ధనిక వర్గాలకు కూడా ఇంధన రాయితీని ఇవ్వడంతో అది దేశ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీనితో సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత వస్తోంది. 100 మంది కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఆమెపై ఈ నెల 24 వ తేదీలోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
దీనితో ఆమె తన తప్పు తెలుసుకున్నానన్నారు. తప్పులు చేశామని గుర్తించామని అన్నారు. తప్పులకు క్షమాపణలు కూడా తెలిపారు. 2019 మేనిఫెస్టో ఆధారంగా వాటిని అమలు చేయాలని భావించామని, అందుకే ఆ బడ్జెట్లో అలా ప్రకటించామని తెలిపారు లిజ్. ఇప్పటికే బ్రిటన్ ప్రతికూల పరిస్థితిలో ఉందని, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవనీ గుర్తు చేశారు. తన నిర్ణయాలలో తప్పులు దొర్లుతున్నందుకు క్షమించాలని కోరారు. ఆ తప్పులను సరిచేసుకుంటున్నానని, కొత్త ఛాన్స్లర్ను నియమించానని తెలిపారు. తాను ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించాం అనీ పేర్కొన్నారు.