NewsTelangana

రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్, బీజేపీకి చెందిన గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకులంతా మునుగోడు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో మాత్రం నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తూనే ఉంది. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు. అయితే హాస్తం పార్టీకి షాకిస్తూ వెంకటరెడ్డి… టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు . గతంలో రేవంత్ రెడ్డి చేసిన హోంగార్డు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మునుగోడు ప్రచారానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను హోంగార్డునని, ఎస్పీ స్థాయి వాళ్లు మునుగోడులో ప్రచారం చేస్తారని పరోక్షంగా రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తున్నారు. దీంతో తన తమ్ముడికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ప్రచారం చేస్తారా అనేది పెద్ద ప్రశ్నగా ఉండేది. ఇప్పుడు నామినేషన్ల పర్వం ముగిసి, అన్ని పార్టీలు ప్రచారంలో నిమగ్నమైన సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుల్ క్లారిటీ ఇచ్చారు. మునుగోడులో తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం లేదని తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.