మునుగోడులో బెట్టింగ్…రూ.50 వేలకు లక్ష
తెలంగాణలో మరో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నికను సెమీ ఫైనల్‌గా ప్రధాల పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. నోటిఫికేషన్ రాకముందు నుంచే గెలుపు కోసం కసరత్తులు మొదలుపెట్టాయి. దీనిపై బెట్టింగ్‌ల జోరు కూడా కొనసాగుతోంది. కాయ్ రాజా కాయ్ అంటూ ఉపఎన్నికపై మునుగోడులో భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న సామాన్యులు కూడా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. కొంతమంది మాఫియాగా ఏర్పడి బెట్టింగ్‌లకు తెరలేపినట్లు చెబుతున్నారు . కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ఫోన్ ఫే, గూగుల్ పే,పేటీఎం, ద్వారా నగదు లావాదేవీలు జరుపుతున్నారు. ఎంత మొత్తంలో బెట్ కడితే.. వారికి డబుల్ మనీ ఇస్తామంటూ బెట్టింగ్ మాఫియా ఆఫర్లు కూడా పెడుతోంది.

కొంతమంది లక్షల్లో కూడా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, ఉపఎన్నికలపై కూడా జోరుగా బెట్టింగ్‌లు సాగాయి. ఇప్పుడు తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారడంతో, విజయం ఎవరిని వెరిస్తుందనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. పార్టీల నేతలు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. దీంతో మునుగోడులో ఎవరు గెలుస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తమ సొంత అంచనాలతో లక్షల్లో బెట్ కడుతున్నారు. ఎక్కువగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల గెలుపుపై బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు చెబుతున్నారు.