Telangana

కేటీఆర్‌ దత్తత ప్రకటనపై కిషన్‌ రెడ్డి సెటైర్లు

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మునుగోడుకు మూడు నెలలకొకసారి వస్తానని, సిరిసిల్లలా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా మునుగోడు దత్తత ప్రకటనపై ప్రత్యర్థి పార్టీల నేతలు కేటీఆర్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ ను చూసుకొండని వ్యంగ్యంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ పేరంటేనే అసహ్యమని, అందుకే బీఆర్‌ఎస్ ను ఏర్పాటు చేశారన్నారు. కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ఉప ఎన్నికలు ఆఖరి ఎన్నికలు కావాలి. టీఆర్‌ఎస్ వీఆర్ఎస్ తీసుకునే సమయంలో కేసీఆర్, బీఆర్‌ఎస్‌ అని కొత్త నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్‌ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తోందన్నారు. సచివాలయానికి రాని ఏకైక సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. మునుగోడులో ప్రజా పాలన కోసం బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు కిషన్ రెడ్డి