Andhra PradeshNews

వైసీపీ ప్రభుత్వానికి మావోయిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనపై మావోయిస్టులు మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు వైసీపీ మంత్రులు, నేతలను లేఖల ద్వారా బెదిరిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ నాయకుల భూకబ్జాలు, అరాచకాలపై ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ప్రధానంగా సీఎం జగన్, విజయసాయి రెడ్డి, అప్పలరాజు, శెట్టి ఫాల్గుణ పేర్లను మావోయిస్టులు ప్రస్తావించారు. ఏపీలో  రియల్ ఎస్టేట్ కోసమే సీఎం జగన్ మూడు రాజధానులను తీసుకొచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎం విశాఖలో భూములను బంధువులకు ,వ్యాపారులకు కట్టబెట్టారని మావోలు లేఖలో ఆరోపించారు. అవినీతి,అక్రమాలతో వేలకోట్లు పోగేసుకు పుట్టిందే  వైసీపీ అని లేఖలో తెలిపారు. ఈ లేఖలో ముఖ్యంగా ఏపీ మత్స్య శాఖ మంత్రి అప్పలరాజుని తన పద్దతి మార్చుకోవాలంటూ మావోయిస్టులు హెచ్చరించారు. అంతేకాకుండా ఏపీలో భూకబ్జాలకు పాల్పడుతున్న వైసీపీ అనుచరులను అదుపులో ఉంచాలని మావోలు సూచించారు. వీటిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు అక్రమాలకు పాల్పడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ హెచ్చరిక లేఖ సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.