National

సింహం వచ్చిందంటూ మోదీ అభిమానుల సంబరాలు

హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇది దేశంలో ప్రవేశపెట్టిన నాల్గో వందే భారత్ రైలు. గతంలో పోల్చితే అధునాతన వెర్షన్, ఇది చాలా తేలికైనది. తక్కువ వ్యవధిలో అధిక వేగాన్ని చేరుకోగలదు. కేవలం 3 గంటల్లో ఢిల్లీ నుండి చండీగఢ్ వరకు ప్రయాణించవచ్చు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది, అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనాలో ఆగుతుంది. గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

చిన్నారులు, వృద్ధులు, మహిళలు సహా వేలాదిమంది బీజేపీ జెండాలతో మోదీకి ఘన స్వాగతం పలికారు. దేఖో ఆయా షేర్ ఆయా (సింహం వచ్చింది చూడండి) అంటూ నినాదాలు చేశారు. మోదీతో ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. హిమాచల్‌లోని చంబా జిల్లాలో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు మరియు బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 1900 కోట్లకు పైగా వ్యయంతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. API దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని, 20,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని అంచనా. ప్రధాని పర్యటనలో హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్ ఉన్నారు.