NationalNews

యూపీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు..

భారత రాజకీయాల్లో కురు వృద్ధుడు, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం శాసించిన ములాయం సింగ్‌ యాదవ్‌ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులను అలంకరించారు. ప్రముఖ స్వాంతంత్య్ర సమరయోధుడు, సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్‌ లోహియా, ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్‌ నారాయణ్‌ల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ములాయం ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక శిఖరంలా నిలిచారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి రాష్ట్రానికి పెద్ద దిక్కుగా మారారు.

రాష్ట్ర మంత్రిగా 1977లో తొలిసారి..

1967లో తొలిసారి ఉత్తరప్రదేశ్‌ శాసనభలో అడుగు పెట్టిన ములాయం ఆ నియోజక వర్గం నుంచే 8 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అక్కడి ప్రజలకు ఆయన పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనం. అప్పటి నుంచి అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన ఈ ఉద్ధండ రాజకీయ నాయకుడు 1977లో తొలిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడినందుకు ములాయం 19 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. 1980లో యూపీలోని లోక్‌దళ్‌ (పీపుల్స్‌ పార్టీ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1982లో యూపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై 1985 వరకు కొనసాగారు. లోక్‌దళ్‌ పార్టీ చీలిపోయినప్పుడు క్రాంతికారీ పార్టీని ములాయం ప్రారంభించారు.

1989లో తొలిసారి సీఎం పదవి..

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవిని ములాయం 1989లో తొలిసారి చేపట్టారు. 1990 నవంబరులో కేంద్రంలో వీపీ సింగ్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత చంద్రశేఖర్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ (సోషలిస్టు) పార్టీలో ములాయం చేరారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 1991లో కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ములాయం ప్రభుత్వం పడిపోయింది. తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ములాయం ఓడిపోయి రాష్ట్రంలో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది.

1993లో రెండోసారి సీఎం పదవి..

1992లో సొంతంగా సమాజ్‌వాదీ పార్టీ (సోషలిస్టు పార్టీ)ని స్థాపించిన ములాయం 1993లో బహుజన సమాజ్‌ పార్టీతో కలిసి యూపీ పీఠాన్ని మళ్లీ అధిరోహించారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌ మద్దతుతో రెండోసారి యూపీ సీఎం అయ్యారు. 1994లో ముజఫర్‌ నగర్‌లో ఉత్తరాఖండ్‌ కార్యకర్తలపై జరిగిన కాల్పులకు ములాయంను బాధ్యుడిని చేస్తూ అన్ని రాజకీయ పక్షాలు ఆయనపై తిరుగుబాటు చేశాయి. బీఎస్పీ మద్దతు ఉపసంహరించడంతో 1995 జూన్‌లో ములాయం ప్రభుత్వం పడిపోయింది.

2003లో సీఎంగా ముచ్చటగా మూడోసారి..

2003లో బీఎస్పీ-బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడంతో బీఎస్పీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ములాయంకు మద్దతుగా నిలిచారు. స్వతంత్రులు, చిన్న పార్టీలు, బీఎస్పీ తిరుగుబాటుదారులతో కలిసి ములాయం 2003 సెప్టెబరులో మూడోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అప్పుడు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ములాయం ముఖ్యమంత్రిగా 2004 జనవరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకంగా 94 శాతం ఓట్లతో రికార్డు నెలకొల్పారు. 2007 వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు.