దుర్గమ్మ నిమజ్జనంలో విషాదం.. 8 మంది మృతి
దసరా పండుగ రోజున దుర్గమ్మ తల్లి నిమజ్జనం సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో స్థానిక మాల్ నదిలో బుధవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు అమ్మవారి విగ్రహాన్ని నది మధ్యలో ఓ దీవి లాంటి ప్రదేశంలో నిమజ్జనం చేస్తుండగా నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో నిమజ్జనం కోసం అక్కడికి వెళ్లిన వారు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన పోలీసులు 50 మందిని కాపాడారు. అప్పటికే నదీ ప్రవాహంలో 8 మంది కొట్టుకుపోయారు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.

సిక్కిం వంటి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్లే వరద ఉధృతి అకస్మాత్తుగా పెరిగిందని జిల్లా కలెక్టర్ మౌమిత గొడర బసు చెప్పారు. వరద వచ్చినప్పుడు నదిలో వందలాది మంది ఉన్నారని.. అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో తీరానికి సమీపంలో ఉన్న వాళ్లు ఒడ్డుకు వెళ్లిపోయారని తెలిపారు. స్వలంగా గాయపడిన 13 మందిని సమీప ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు రాష్ట్ర మంత్రి, మాల్ ఎమ్మెల్యే బులు చిక్ బరైక్ అక్కడే ఉన్నారు.