భారత అమ్ముల పొదిలో ‘ప్రచండ్’
భారత అమ్ముల పొదిలో మరో కీలక మైలురాయి చేరింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ప్రచండ్’ అనే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ను సోమవారం భారత వాయుసేనకు అప్పగించారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాలుగు హెలికాప్టర్లను భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. దీంత భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది.

ప్రచండ్‌లో ప్రయాణించిన రాజ్‌నాథ్‌సింగ్..
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన ఈ లైట్ కంబాట్ హెలికాప్టర్ ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో పోరాటానికి చాలా బాగా పనికొస్తుంది. 5.8 టన్నుల బరువుండే ప్రచండ్‌లో రెండు ఇంజన్లు ఉంటాయి. 5000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుపై దాడి చేయడంతో పాటు ప్రమాదం ఎదురైతే విచిత్ర విన్యాసాలతో తప్పించుకుంటుంది కూడా. ప్రచండ్‌లో రాజ్‌నాథ్ సింగ్ కొద్దిసేపు ప్రయాణించారు. ప్రపంచంలోనే ఇలాంటి యుద్ధ హెలికాప్టర్ ఇది ఒక్కటే. రూ.3,887 కోట్లతో భారత వైమానిక దళం కోసం 10, ఆర్మీ కోసం 5 హెలికాప్టర్లను తయారు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

