రైలులో ప్రయాణించిన మోదీ
గుజరాత్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
రైలులో ప్రయాణికులతో ప్రధాని ముచ్చట్లు
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రైలులో ప్రయాణించారు. గాంధీనగర్-ముంబై మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రైలును గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని.. రైలు ఎక్కి ఇంజన్‌ను పరిశీలించారు. ఉద్యోగులతో ముచ్చటించారు. ఆ తర్వాత రైలు బోగి ఎక్కి కాలుపుర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తూ ప్రయాణికులతోనూ ముచ్చటించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. వేగంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం ఈ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత.

గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న మోదీ సూరత్‌లో రూ.3,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భావ్‌నగర్‌లో రూ.5,200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 36వ జాతీయ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు.