Andhra PradeshNews

నారా లోకేశ్‌ ఈసారి ఎక్కడి నుంచి..? మంగళగిరి సురక్షితమేనా..?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? గత ఎన్నికల్లో ఓటమి పాలైన మంగళగిరినే మళ్లీ ఎంచుకుంటారా..? గుడివాడకు వెళ్తారా..? గన్నవరం అయితే బాగుంటుందనుకుంటున్నారా..? నిజానికి.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్‌ పోటీ చేసే నియోజక వర్గం అందరి దృష్టిని ఆకర్షించనుంది. రానున్న కాలంలో వైఎస్‌ జగన్‌కు దీటైన నాయకుడిగా లోకేశ్‌ను తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు ప్లాన్‌ చేస్తున్నారు. అదే సమయంలో లోకేశ్‌ను రాజకీయాల్లో నిలబడనీయకుండా ఇబ్బంది పెట్టాలని జగన్‌ వ్యూహం రచిస్తున్నారు. అందులో భాగంగానే 2019లో సర్వశక్తులూ ఒడ్డి లోకేశ్‌ను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓడించారు. ఈసారి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు మంగళగిరిపై జగన్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నిజానికి మంగళగిరి ప్రజలు ఇప్పుడు వైసీపీ అంటే భగ్గుమంటున్నారు. లోకేశ్‌ను ఓడించి వైసీపీ వైపు మొగ్గు చూపితే మూడు రాజధానులంటూ జగన్‌ తమ నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాళ్లను శాంతింపజేసేందుకు మంగళగిరి నియోజక వర్గానికి జగన్‌ ఇటీవల ఏకంగా రూ.137.11 కోట్ల నిధులు విడుదల చేశారు. అక్కడ సీసీ, బీటీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, రోడ్ల విస్తరణ వంటి పనులు చేయించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

పద్మశాలి ఓటర్లే కీలకం..

అంతేకాదు.. మంగళగిరిలో టీడీపీ నేతలందరికీ పదవుల ఆశ చూపి వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా నియోజక వర్గంలో చేనేత సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు. 3 లక్షలకు పైగా ఉన్న పద్మశాలి ఓటర్లు ఇక్కడ కీలకం కానున్నారు. దీంతో ఆ ఓటర్లను చీల్చేందుకు బీసీ నేతలపై జగన్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మంగళగిరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, పార్టీ సీనియర్‌ నేత మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వంటి బీసీ నేతలకు వైసీపీ తీర్థం ఇచ్చారు. అయితే.. జగన్‌ వ్యూహం బెడిసి కొట్టే ప్రమాదమూ లేకపోలేదు. నియోజక వర్గంలో టీడీపీ సీనియర్‌ నేతలందరినీ వైసీపీలోకి తీసుకోవడంతో జగన్‌కు కొత్త తలనొప్పి తయారైంది. ఇక్కడి టికెట్‌ కోసం అందరూ పోటీదారులే అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒకరికి టికెట్‌ ఇస్తే ఇతర నాయకులు గ్రూపు రాజకీయాలతో వైసీపీని ఓడించే ప్రమాదమూ లేకపోలేదని వార్తలందుతున్నాయి. అందుకే మురుగుడు హనుమంతరావును ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి పరిచారు.

అమరావతి రైతుల ఆందోళనతో వైసీపీకి మైనస్‌..

మరోవైపు.. అమరావతి పోరు కూడా జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు సుదీర్ఘ పోరాటం చేయడంతో మంగళగిరి నియోజక వర్గంలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఇటీవలి సర్వేలో తేలింది. వచ్చే ఎన్నికల్లో ఇది జగన్‌కు పెద్ద మైనస్‌ పాయింట్‌గా మారే ప్రమాదమూ లేకపోలేదు. అమరావతి రైతుల అసంతృప్తిని టీడీపీ తనకు పూర్తి అనుకూలంగా మార్చుకుంటోంది. జగన్‌ అయితే.. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటం వెనుక టీడీపీ ఉందని అనుమానిస్తున్నారు. అందుకే.. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించి కొత్త వివాదానికి తెర లేపారు. అప్పుడు టీడీపీ అమరావతి రైతుల నుంచి దృష్టిని మరలుస్తుందని ఆశిస్తున్నారు. నిజానికి.. మంగళగిరి నియోజక వర్గంలో నారా లోకేశ్‌కు 2019లోనూ పెద్దగా వ్యతిరేకత రాలేదు. వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి 1,08,464 ఓట్లు సాధించగా.. లోకేశ్‌కు 1,03,127 ఓట్లు వచ్చాయి. రామకృష్ణ రెడ్డి 47 శాతం ఓట్లు సాధిస్తే లోకేశ్‌ 45 శాతం ఓట్లు సాధించారు. అంటే.. ఇద్దరి మధ్య ఓట్ల తేడా 2 శాతం మాత్రమే. అక్కడ సీపీఐ తరఫున పోటీ చేసిన ముప్పల్ల నాగేశ్వర రావు 10,135 ఓట్లు సాధించారు. లోకేశ్‌ కేవలం 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

రామకృష్ణ రెడ్డిని మార్చే ప్లాన్‌..

రాష్ట్రంలో టీడీపీకి పెరిగిన ఆదరణ.. అమరావతి రైతుల సుదీర్ఘ ఉద్యమం.. తదితర కారణాలు నారా లోకేశ్‌కు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీ చేస్తే విజయం నల్లేరుపై నడకే అవుతుందనే వార్తలొస్తున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో రామకృష్ణ రెడ్డిని మంగళగిరి నుంచి సత్తెనపల్లి నియోజక వర్గానికి పంపించాలని జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం. నియోజక వర్గంలో 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న చేనేత సామాజిక వర్గం నేతను వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్‌ చేస్తున్నారు.