NationalNews

రాహుల్ పార్టీని దారిలోకి తెస్తాడా..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశాన్ని చుట్టేయాలనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేయతలపెట్టిన యాత్ర జోరుగా సాగుతోంది. మొన్నటి వరకు నిరుత్సాహంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. రాహుల్ యాత్రతో చైతన్యం పొందుతున్నాయ్. పాదయాత్రలో మహిళలు, యువత నుంచి వస్తున్న స్పందనకు రాహుల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాజాగా పాదయాత్రలో తనకు సంఘీభావం తెలిపిన చిన్నారి చిత్రాన్ని షేర్ చేసిన రాహుల్ గాంధీ.. ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు.. వెయ్యి మైళ్లైనా నడవగలనన్నారు. ఇలాంటి చిన్నారుల ముఖంలో ఆనందం చూడటానికి దేనికైనా సిద్ధమన్నారు. రాహుల్‌ను కలిసిన తర్వాత చిన్నారి ముఖారవిందాన్ని చూసిన ఆయన… ఇలాంటి క్షణాలు చూసేందుకు వెయ్యి మైళ్లు అవలీలగా నడుస్తానన్నారు.

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర ద్వారా యువత, మహిళలు, విద్యావంతుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమాలు వేరు.. ఇప్పుడు వేరు అన్నట్టుగా మొత్తం సీన్ కన్పిస్తోంది. 52 ఏళ్ల వయసులో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాహుల్ గాంధీ చిన్న పిల్లలతో ముచ్చటిస్తున్న అనేక ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయ్. ఇటీవల ఒక మహిళ, రాహుల్ ను కలిసిన తర్వాత ఆ ఘట్టమంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మార్చ్‌లో రాహుల్ గాంధీతో కలిసి నడిచేందుకు భద్రతాధికారులు అనుమతివ్వడంతో ఆమె కన్నీళ్లతో చూపించిన ఆప్యాయత నెటిజెన్లను ఆకట్టకుంది. ఈ వీడియోకు క్యాప్షన్లు అవసరం లేదు. ప్రేమ ఉప్పొంగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ చేసింది.

కేరళలోని పాఠశాల విద్యార్థినుల బృందంతో పరిచయం చేసినప్పుడు సైతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. కేరళ BTS ఆర్మీ అమ్మాయిలతో ఒక సంతోషకరమైన చాట్‌‍ను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పాఠశాల బాలికలతో తన సంభాషణ వీడియోను షేర్ చేశారు. రాహుల్ గాంధీతో విద్యార్థుల ముచ్చట్లు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయ్.

3,570 కిలోమీటర్ల యాత్ర సెప్టెంబర్ 8న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది. కొత్త అధ్యక్షుడి కోసం కాంగ్రెస్‌లో తీవ్ర రగడ జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర మాత్రం ఉత్సాహంగా సాగుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తర్వాత గత వారం పార్టీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అనుభవజ్ఞుడు అశోక్ గెహ్లాట్‌ను పార్టీ చీఫ్‌గా ఎన్నుకుంటే… ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరించబోమంటూ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే జరిగే నష్టం లేదు… ఏదైనా సాధ్యమే అన్నట్టుగా రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతూ.. దేశాన్ని మార్చాలంటూ పిలుపునిస్తున్నారు.