శ్రమైక జీవన సౌందర్యమంటే ఇది కదా..!
ఏదైనా సంకల్పం ముందు బలాదూరే… దేశాధినేతలు, సీనియర్ అధికారులు కొన్నిసార్లు వారు చేసే పనులు నిజంగా సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంటాయ్. కొందరు ప్రచారం కోసం కొన్ని పనులు చేస్తే.. కొందరు రాజకీయనేతలు, అధికారులు మాత్రం తాము కూడా సమాజంలో భాగమనే భావిస్తారు. అందుకే కొందరు రాజకీయనేతలు మిగతావారికి సాధ్యం కాని రీతిలో ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. అధికారులు కూడా అంతే. కొందరు… అధికారులను సామాన్యులు ప్రేమించినట్టుగా మరెవరినీ కూడా తలచుకోరు. ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో తాజాగా కన్పించింది. ఇద్దరు భార్యభర్తలు పక్క జిల్లాలకు కలెక్టర్లుగా ఉండటం విశేషం. అంతే కాదు వారు ప్రజల్లో కలిసి వారిలో భాగమన్న భావన కలిగిస్తే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దృశ్యం మనకు ఇటీవల రెండు జిల్లాలుగా విడిపోయిన ప్రకాశం జిల్లాలో కన్పించింది. రెండు జిల్లాలుగా విడిపోయాక ప్రకాశం, బాపట్ల జిల్లాలు ఆవిర్భవించాయ్. అయితే రెండు జిల్లాలకు కలెక్టర్లుగా భార్యభర్తలు రావడం విశేషం. ఇటీవల ఇద్దరు ఐఏఎస్‌లు ప్రజల కోసం చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు వార్తాంశాలుగా మారుతున్నయ్. ఇవాళ ఇద్దరు కలెక్టర్లు చేసిన ఓ పని గురించి మీరు తెలుసుకోవాలి…

అవును ఇక్కడ మీరు చూస్తున్నది వ్యవసాయ కూలీలు అనుకుంటే పొరపడినట్లే. వారిద్దరూ ఐఏఎస్ అధికారులు. బాపట్ల, ప్రకాశం జిల్లాలలో కలెక్టర్లు. ఆ హోదాను ప్రక్కన పెట్టి సరదాగా వరినాట్లు వేశారు. కలెక్టర్లమని బిర్ర బిగుసుకోకుండా ప్రజలతో మమేకమై ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయకృష్ణన్ పొలాల్లోకి దిగారు. భార్యా భర్తలైన ఈ ఇరు జిల్లాల కలెక్టర్లు నిరాడంబర జీవనం గడిపారు. ఈ మధ్యే చీరాలలో వారిద్దరూ సామాన్యుల మాదిరి వాకింగ్ చేస్తూ మీడియా కెమెరాలకు చిక్కారు. ఇప్పుడు తాజాగా ఆదివారం ఈ ఇద్దరు కలెక్టర్లు తమ పిల్లలతో కలిసి బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామంలోని పొలాలలో కూలీలతో జతకట్టి వరినాట్లు వేశారు.

కూలీలకు ఏమాత్రం తీసిపోకుండా అంతే నైపుణ్యంతో వారు వరినాట్లు వేయడం విశేషం. అంతేగాకుండా కూలీలతో కలిసి ఇద్దరు కలెక్టర్లు వారి పిల్లలు తాము తెచ్చుకున్న భోజనం కూలీలతో కలిసి అతి సాధారణంగా పొలం గట్లుపై కూర్చొని తిన్నారు. అదే సమయంలో కూలీల జీవన స్థితిగతులను కలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు.
