InternationalNews

చైనా అధ్యక్షుడు హౌస్ అరెస్ట్… ఇంటర్నెట్‌లో రూమర్లు?

జీ జిన్పింగ్ హౌస్ అరెస్ట్
చైనాలో తిరుగుబాటు పుకార్లు
షేకవుతున్న వరల్డ్ ఇంటర్నెట్
ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్షతో చిచ్చు
జీ జిన్పింగ్ గృహనిర్బంధంపై ఊహాగానాలు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గృహనిర్బంధంలో ఉన్నారనే ఊహాగానాలతో ఇంటర్నెట్ హోరెత్తుతోంది. సోషల్ మీడియాలో అనేక పోస్ట్‌ల ప్రకారం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) అధిపతిగా జి జిన్‌పింగ్‌ను తొలగించారని… ఆయనను గృహనిర్బంధంలో ఉంచారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయ్. ఐతే మొత్తం వ్యవహారాలను అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ, అధికార మీడియా ఇంకా ధృవీకరించలేదు. జి జిన్‌పింగ్ ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమ్మిట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో చర్చలు జరిపారు. 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్, చైనాల మధ్య సంబంధాలు తెగిపోయిన తర్వాత ఇరుదేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు మాత్రం జరపలేదు.

చైనాలో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా పోస్ట్‌లు పుంకానుపుంకాలుగా వస్తున్నాయ్. ఇది సైనిక తిరుగుబాటు అని, ఇప్పటికే రాజధాని బీజింగ్ వైపు PLA వాహనాలు వెళ్లాయన్న ప్రచారం మొదలైంది. PLA సైనిక వాహనాలు సెప్టెంబరు 22న బీజింగ్‌ చుట్టూ చేరాయి. బీజింగ్ సమీపంలోని హువాన్‌లై కౌంటీ నుండి ప్రారంభమై హెబీ ప్రావిన్స్‌లోని జాంగ్జియాకౌ నగరంలోనూ సైన్యాన్ని మోహరించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హెడ్‌గా… అధ్యక్షుడు జీజిన్పింగ్‌ను తొలగించినట్టుగా వార్తలు వస్తున్నాయ్. సీనియర్ అధికారులందరినీ జైలుకు పంపించారు. బీజింగ్ మీదుగా ఎలాంటి వాణిజ్య విమానాలు ప్రయాణించడం లేదని తెలుస్తోంది.


సోషల్ మీడియాలో తాజా పరిణామాలను బట్టి చైనాలో తిరుగుబాటు జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిపుణులు సైతం ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. జీ జిన్పింగ్ ఉజ్బెకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నిర్బంధంలో ఉంచారని… కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఈ వారం ప్రారంభంలో చైనా ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష విధించిన తర్వాత జీ జిన్‌పింగ్ గృహనిర్బంధంపై ఊహాగానాలు వచ్చాయి. జీవిత ఖైదు పడిన ఇద్దరు మంత్రులు, మరో నలుగురు అధికారులు కలిసి తాజా రాజకీయ కుట్రకు కారణమన్న చర్చ సాగుతోంది. అధ్యక్షుడు జీజిన్పింగ్ మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత… వచ్చే నెలలో రాజకీయ సమావేశానికి ముందు చైనాలో అవినీతి వ్యతిరేక చర్యలు గందరగోళానికి కారణమవుతున్నాయ్.