NationalNews

మైనింగ్‌ కేసు ఇంకెంతకాలం: సుప్రీంకోర్టు.. చిక్కుల్లో ‘గాలి’, సబిత

ఓబుళాపురం మైనింగ్‌ కేసును పుష్కర కాలంగా తేల్చకుండా వదిలేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై తీర్పు ఇవ్వకుండా ఇంకెంతకాలం సాగదీస్తారని సీబీఐ కోర్టును ప్రశ్నించింది. మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్ధన్‌ రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉద్దేశపూర్వకంగా డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేస్తూ.. బెయిల్‌పై యథేచ్ఛగా తిరగడంపై అభ్యంతరం తెలిపింది. ఈ కేసును త్వరగా తేల్చాలని సీబీఐ కోర్టును ఆదేశించింది.

డిశ్చార్జ్‌ పిటిషన్లపైనే విచారణ..

ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌ గతంలో చేపట్టిన అక్రమ తవ్వకాలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ పన్నెండేళ్ల క్రితం కేసు నమోదు చేసింది. గాలి జనార్ధన్‌ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి తదితరులపై దాఖలైన అసలు కేసులను వదిలేసి.. వీళ్లు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపైనే ఇంతకాలంగా విచారణ జరుగుతోంది. దీనిపై అసంతృప్తితో ఉన్న సీబీఐ కోర్టు.. నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

29లోపు డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు..

నిందితులు హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోందని సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే వాళ్లు దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణను ఈ నెల 29వ తేదీ నాటికి పూర్తి చేసి తీర్పు కూడా ఇచ్చేయాలని ఆదేశించింది. ఫలితంగా సీబీఐ కోర్టు వేగంగా కదులుతోంది. దీంతో ఈ కేసుల్లో తీర్పు త్వరగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సబిత, గాలికి కష్టాలు తప్పవా..?

తీర్పు వస్తే ఈ కేసులో ప్రధాన నిందుతులైన గాలి జనార్ధన్‌ రెడ్డికి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చిక్కులు తప్పేట్లు లేవు. తెలంగాణ, కర్నాటకల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తీర్పు వ్యతిరేకంగా వచ్చి గాలి జనార్ధన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి శిక్ష అనుభవించాల్సి వస్తే.. ఎన్నికల సంవత్సరంలో కర్నాటకలో జనార్ధన్‌కు, తెలంగాణాలో సబితకు ఇబ్బందులు తప్పని పరిస్థితి తలెత్తింది.