ఆ ఎన్నిక చెల్లదు… జగన్‌కు ఈసీ ఝలక్…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ఈ సంవత్సరం జూలై నెలలో రెండు రోజులపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల్లో వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఆ పార్టీ సభ్యులు వైఎస్ జగన్‌ను ఎన్నుకున్నారు. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి శాశ్వత అధ్యక్షులు ఇప్పటిదాకా లేరని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. దీనిపై మీడియాలో వచ్చిన కథనాలు, వార్తలను గమనించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంపై స్పందించింది. ఏ పార్టీకి శాశ్వత అధ్యక్షులు గానీ.. శాశ్వత పదవులు గానీ వర్తించవని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డికి పంపించింది. శాశ్వత అధ్యక్షుడి నియామకంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల కమిషన్ అనేకమార్లు లేఖలు రాసినా.. స్పందించకపోవడంతో వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వైసీపీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.


