డిప్యూటీ కలెక్టర్ నుంచి జైలు దాకా.. వయా అరకు ఎంపీ..
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ను మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వర రావుకు ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఆదేశం మేరకు అరెస్టు చేసిన గీత దంపతులకు హైకోర్టు రూ.25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు గీత దంపతులకు సీబీఐ ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది. వారిని అరెస్టు కూడా చేశారు. బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్‌లకూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది.

ఏమిటా కేసు..?
విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు పంజాబ్ నేషనల్ బ్యాంకు బంజారాహిల్స్ బ్రాంచ్ నుంచి రూ.42.76 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే.. ఆ రుణాన్ని ఎంతకూ కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులతో గీత దంపతులు కమ్మక్కు అయ్యారని, రూ.52 కోట్ల మనీలాండరింగ్ జరిగిందని 2015 జూలై 11వ తేదీన చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. అప్పటి పంజాబ్ నేషనల్ బ్యాంకు హైదరాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ బీకే జయ ప్రకాశం, అప్పటి జనరల్ మేనేజర్ కేకే అరవిందాక్షన్ తదితరులపైనా అభియోగాలు నమోదు చేసింది. కొత్తపల్లి గీత, ఆమె భర్త తప్పుడు పత్రాలు సమర్పించి.. రుణాన్ని అక్రమంగా తీసుకొని బ్యాంకును మోసం చేశారని, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని గీత సొంత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని సీబీఐ అధికారులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నత ఉద్యోగం..
20 ఏళ్ల వయసులోనే ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన కొత్తపల్లి గీత.. గోదావరి గ్రామీణ బ్యాంకులో రెండేళ్లు పనిచేశారు. తర్వాత గ్రూప్-1 పరీక్ష రాసి 1999లో డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ కలెక్టర్‌గా, ఆర్డీవోగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. 2010లో ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు (ఎస్టీ) నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొంత కాలానికే ఆ పార్టీతో విభేదాలు తలెత్తడంతో 2018లో జనజాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 2019లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. నిజానికి.. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని.. అరకు ఎంపీగా ఆమె ఎన్నిక చెల్లదని ఫిర్యాదులు రావడంతో విచారణ కమిటీ కూడా వేశారు. ఇప్పుడు బ్యాంకును మోసం చేసిన కేసులో చిక్కుకున్నారు.