Andhra Pradesh

రెండో రోజు వాడి వేడిగా ఏపీ అసెంబ్లీ

◆ 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సస్పెన్షన్
◆ అసెంబ్లీ ని సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్

ఏపీ శాసనసభ సమావేశాలు రెండో రోజు కూడా వాడి వేడిగా జరిగాయి. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ చార్జీ,లు పన్నులపై టీడిపి సభ్యులు చర్చకు పట్టు పట్టడంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు గట్టిగట్టిగా కేకలు వేసుకున్నారు. వాయిదా తీర్మానం తిరస్కరించినందుకు చర్చకు అవకాశం లేదంటూ స్పీకర్ రూలింగ్ ఇవ్వటంతో ప్లకార్డులు పట్టుకొని టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు. కొందరు సభ్యులు పోడియం పైకి చేరుకొని బాదుడే – బాదుడు అంటూ గట్టిగా నాదాలు చేశారు. వీరి ఆందోళన కొనసాగుతుండగానే సభలో కొన్ని బిల్లులు ప్రవేశ పెట్టడంతో పాటు మరికొన్నిటిని ఆమోదించారు. వీరి నినాదాలతో ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం తదుపరి చర్యలకు తీర్మానం ప్రవేశపెట్టాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కి సూచించారు. బుగ్గన పెట్టిన తీర్మానం మేరకు 13 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

అయినప్పటికీ టీడీపీ సభ్యులు బయటికి వెళ్లకుండా నినాదాలు చేస్తుం డతో స్పీకర్ తీవ్ర ఆగ్రహంతో వారిని బయటకు తోసి వేయండి అంటూ మార్షల్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు ఇది ఒక అలవాటుగా మారిందని… వారి ప్రవర్తనతో సస్పెండ్ చేస్తున్నానంటూ కోపంతో ఊగిపోయారు. స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహించారు. మార్షల్స్ తో ఎలా బయటకు పంపుతారంటూ ప్రశ్నించారు. దీంతో స్పీకర్ స్పందిస్తూ సభ్యులు సభ నిబంధనలను పాటించకపోతే మార్షల్స్ తో బయటకు పంపి సభ నిర్వహించాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తు చేశారు. సమావేశంలో సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మాట్లాడిన తర్వాత స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.