NewsTelangana

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయా..?

తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్సా..? బీజేపీనా..? అధికార పక్షంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నది ఎవరు..? ప్రజల చూపు ఎటువైపు..? రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవడం.. బీజేపీ జాతీయ నాయకులు అమిత్‌ షా, జేపీ నడ్డా తెలంగాణాలో సుడిగాలి పర్యటనలు చేయడం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ను వదిలేసి బీజేపీనే టార్గెట్‌ చేయడం.. సీఎం కేసీఆర్‌ కూడా బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీపైనే విరుచుకుపడటం.. ఈ పరిణామాలన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్‌ నుంచి బీజేపీ లాగేసుకుందనే వాతావరణం కనిపిస్తోంది.

బీజేపీని చూసి భయపడుతున్న కేసీఆర్‌

ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజలు ప్రధాన ప్రతిపక్షం వైపే మొగ్గు చూపుతారు. అందుకే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీని చూసి భయపడతారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్‌ ఏడాది నుంచి బీజేపీని చూసి భయపడుతున్నారు. ఇటీవల బీజేపీ నాయకులనే టార్గెట్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులతో దోస్తీ చేస్తున్నారు. దీన్ని బట్టి వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారు బీజేపీ అనే నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చారని తెలుస్తోంది.

బీజేపీ దూకుడు..

దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటి నుంచి కేసీఆర్‌ వైఖరి మారింది. ఏకంగా జాతీయ పార్టీ పెట్టి.. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని హూంకరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఢిల్లీ గద్దెపై టార్గెట్‌ పెట్టారు. బీజేపీ కూడా అంతే దూకుడుగా కేసీఆర్‌ ప్రభుత్వంపై ఫైట్‌ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. జాతీయ పార్టీ పెట్టినా.. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకున్నా.. బలమైన మోడీ సర్కారును గద్దె దించడం అంత సులువేమీ కాదనే విషయం కేసీఆర్‌కూ తెలుసు.

అసెంబ్లీలో భట్టికి కేసీఆర్‌ పెద్దపీట..

అందుకే.. కాంగ్రెస్‌ మద్దతు కూడా తీసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ సభ్యులు పల్లెత్తు మాట అనలేదు. సభలో భట్టి మాట్లాడుతున్నప్పుడూ ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. సభ్యుల సంఖ్యా బలాన్ని బట్టి పార్టీలకు సభలో మాట్లాడే సమయాన్ని స్పీకర్‌ కేటాయిస్తారు. కాంగ్రెస్‌కు ఐదుగురు సభ్యులు, బీజేపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. దీన్ని బట్టి బీజేపీ కంటే కాంగ్రెస్‌కు కొన్ని నిమిషాలు మాత్రమే ఎక్కువ సమయం ఇవ్వాలి. కానీ.. అసెంబ్లీ సమావేశాల్లో అలా జరగలేదు. బీజేపీ ఎమ్మెల్యేల్లో రాజాసింగ్‌ జైల్లో ఉన్నారు. ఈటల రాజేందర్‌ను సస్పెండ్‌ చేశారు. మూడో ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు 3-4 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు. భట్టి విక్రమార్కకు మాత్రం 40 నిమిషాల సమయం ఇచ్చారు. రఘునందన్‌ మాట్లాడిన 3-4 నిమిషాల్లోనూ అధికార పార్టీ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. భట్టి మాట్లాడినంత సేపు ఎవరూ అడ్డు తగలలేదు. ఒకసారి అడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రులను సీఎం కేసీఆర్‌ వారించారు.

కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనని భట్టి..

కేసీఆర్‌ సూచనతోనే భట్టీకి స్పీకర్‌ ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భట్టి కూడా కేంద్ర ప్రభుత్వంపైనే విమర్శలను ఎక్కుపెట్టారు. పైగా కేసీఆర్‌ సర్కారుపై ప్రశంసలు కురిపించారు. భట్టి కాంగ్రెస్‌ సభ్యుడిగా కంటే.. టీఆర్‌ఎస్‌ సభ్యుడిగా రాణించారనే విమర్శలొచ్చాయి. భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు భట్టి మాటల ద్వారా తెలిసింది. ఇదంతా కేసీఆర్‌ డైరెక్షన్‌తోనే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రజల చూపు బీజేపీ వైపు..

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే అని బీజేపీ చేస్తున్న ఆరోపణలు భట్టి, కేసీఆర్‌ కుమ్మక్కుతో నిజమని తేలింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి.. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రజల్లోనూ టీఆర్‌ఎస్‌కు దీటైన ప్రతిపక్షం బీజేపీ మాత్రమేననే అభిప్రాయం కలుగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజల చూపు అనివార్యంగా బీజేపీ వైపు మొగ్గేట్లు కనబడుతోంది.