కరెంట్, వ్యవసాయం అమ్మేసేందుకు కేంద్రం కుట్ర-కేసీఆర్
సైన్యం నియామకాల్లో మార్పులు చేస్తే దేశమంతా మంటపుట్టిందన్నారు కేసీఆర్. ఉద్యమాలను అప్పటికప్పుడు పోలీసులతో అణిచివేయొచ్చని… కానీ యువకుల గుండెల్లో రగిలే మంటలను ఎలా ఆర్పుతారన్నారు. విద్యుత్ ను దేశమంతా ఇచ్చే తెలివి కేంద్రానికి లేకుండా పోయిందని కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర విద్యుత్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నది నిజం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇతర ఖర్చులు తగ్గించుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడే దేశంలో మోదీ సర్కారు వచ్చిందని… 8 ఏళ్లలో తలసరి విద్యుత్ వినియోగం 970 నుంచి 2126 యూనిట్లకు పెంచామన్నారు. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 950 నుంచి 1250 యూనిట్లకు మాత్రమే పెరిగిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో ప్రపంచంలో ఇండియా 104 స్థానంలో ఉందని కేసీఆర్ ఆక్షేపించారు.

కేంద్రం అన్నీ అమ్మేస్తోందని… చివరకు వ్యవసాయం, విద్యుత్ మాత్రమే మిగిలాయన్నారు. సంస్కరణల పేరుతో వీటిని కూడా అమ్మాలని చూస్తున్నారన్నారు. రైతులు వ్యవసాయం చేయలేమంటే.. కార్పొరేట్ కంపెనీలను రంగంలోకి దించొచ్చని కేంద్రం భావిస్తోందంటూ దుయ్యబట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధాన్యం కొనాలని ఢిల్లీలో ధర్నా చేస్తే కొనేది లేదన్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవహేళన చేశారన్నారు. తెలంగాణకు నూకలు తినడం అలావటేనంటూ అవమానించారన్నారు. అవగాహన లేకపోవడం వల్ల ఆహారరంగాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టేసిందన్నారు కేసీఆర్. 20 శాతం సుంకం పెంచి నూకలపై బ్యాన్ విధించిందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో కరెంట్ బిల్లుపై చర్చ జరిగింది. విద్యుత్ చట్టంపై అభ్యంతరాలున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే… మోటార్లకు మీటర్లు పెట్టాలని బిల్లులో ఎక్కడా లేదంటూ బీజేపీ స్పష్టం చేసింది.

