NationalNews

కాంగ్రెస్‌ నాపై క్షిపణులు ప్రయోగించింది

కాంగ్రెస్‌ పార్టీకి తన రక్తాన్ని ధారపోశానని.. ఆ పార్టీ మాత్రం తనను విస్మరించిందని గులాం నబీ ఆజాద్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ తనపై క్షిపణులు ప్రయోగిస్తే.. తాను మాత్రం 303 రైఫిల్‌తోనే ఎదుర్కొన్నానని తెలిపారు. శుక్రవారం శ్రీనగర్‌లో ఓ సభలో ఆజాద్‌ ప్రసంగించారు. తాను కూడా క్షిపణులు ప్రయోగిస్తే కాంగ్రెస్‌ పార్టీ మాయమయ్యేదని జోస్యం చెప్పారు. 52 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న తాను ఇందిరా గాంధీని తల్లిలా.. రాజీవ్‌ గాంధీని సోదరుడిలా భావిస్తానని పేర్కొన్నారు. అందుకే వాళ్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. తాను త్వరలో ఓ రాజకీయ పార్టీ పెడతానని.. ఆ పార్టీ పేరు, జెండాను జమ్మూకశ్మీర్‌ ప్రజలే నిర్ణయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆజాద్‌ రాజీనామా చేయడంతో జమ్మూకశ్మీర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, భూమి హక్కులు, స్థానికులకు ఉద్యోగాల కోసం పోరాడతామని ఆజాద్‌ స్పష్టం చేశారు.