హై స్పీడ్ రైళ్లూ నడుపుతున్న సౌదీ మహిళలు
మహిళలపై కఠిన ఆంక్షలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సౌదీ అరేబియాలో సంస్కరణలు వేగంగా ముందుకెళ్తున్నాయి. ఒకానొక దశలో మగ తోడు లేనిదే బయటకు రావొద్దంటూ మహిళలపై ఆంక్షలు విధించిన సౌదీ ప్రభుత్వం క్రమంగా వారికి స్వేచ్ఛను ఇస్తోంది. ఇంతకాలం వంటింటికే పరిమితమైన మహిళలకు ఇటీవల ఉద్యోగాలు చేసే అవకాశం కూడా కల్పిస్తోంది. కార్లు డ్రైవింగ్ సైతం చేసేందుకు అనుమతి ఇచ్చింది.

ట్యాక్సీ డ్రైవర్లుగా..
అంతేకాదు.. మహిళా ట్యాక్సీ డ్రైవర్లు సైతం సౌదీ అరేబియాలో కనిపిస్తున్నారు. కార్ల మెకానిక్ షెడ్లలోనూ మహిళలు పని చేస్తున్నారు. మహిళా సాధికారత-సామాజిక భద్రత అనే ఆలోచనతో ముందుకెళ్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సౌదీలో హై స్పీడ్ రైళ్లు నడిపేందుకు మహిళలకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. శిక్షణ కోసం దేశవ్యాప్తంగా 31 మంది మహిళలను ఎంపిక చేసింది. రైళ్లు నడిపే శిక్షణ ఇచ్చేందుకు సౌదీ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఏకంగా 28 వేల మంది మహిళలు దరఖాస్తు చేసుకోవడం విశేషం.

రైలు నడిపేందుకు 48 వేల దరఖాస్తులు..
వారిలో 145 మందిని ఇంటర్వ్యూకు పిలిచి.. 31 మందిని తొలి దశ శిక్షణకు ఎంపిక చేశారు. వీరికి 5 నెలల శిక్షణ పూర్తి చేసిన తర్వాత రెండో దశ శిక్షణ కోసం మరింత మంది మహిళలను పిలుస్తామని రైల్వే అధికారులు తెలిపారు. సీనియర్ డ్రైవర్ల సమక్షంలో ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేసుకునే మహిళలకు మక్కా, మదీనా నగరాల మధ్య బుల్లెట్ రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. క్రమంగా అన్ని రంగాల్లో మహిళలకు 33 శాతం అవకాశం కల్పిస్తామని సౌదీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది.