పేద ప్రజల దేవుడు వైయస్సార్
◆ ప్రజలకు మేలు చేయటంలో డైనమిక్ నిర్ణయాలు
◆ అన్ని వర్గాల ప్రజల అవసరాల పట్ల సంపూర్ణమైన అవగాహన
◆ నమ్ముకున్న వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే తెగింపు
◆ చారిత్రాత్మక నిర్ణయాలతో నేటికీ కూడా కోట్లాదిమంది గుండెల్లో ఆయన రూపం పదిలం
(నేడు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం)
ఒకసారి వైయస్ ను కలుసుకున్న వ్యక్తి తనకు ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు భావిస్తాడు. అది వైయస్ వ్యక్తిత్వంలోని విశిష్టత. పేద ప్రజలకు మేలు చేయాలన్న తపన, మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వం, చిరునవ్వు, స్నేహశీలత, ఆపన్నులను ఆదుకునే గుణం, నమ్ముకున్న వారికి అండగా నిలిచేందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడే తెగింపు, కులమతాలకు అతీతంగా వ్యవహరించే లౌకిక స్వభావం, ప్రేమ ఆప్యాయతను పంచిపెట్టే ధోరణి వైయస్ ను ప్రజానాయకుడిగా నిలబెట్టాయి. మీకు అండగా నేనున్నాను అనే భరోసా ప్రజలకి ఇవ్వటంతో వైయస్సార్ నిజమైన ప్రజా నాయకుడు అయ్యారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయటానికి మనస్ఫూర్తిగా నిజాయితీగా, నిబద్ధతో వైయస్సార్ కృషి చేసేవారు.

దూరదృష్టితో అభివృద్ధికి ప్రణాళిక రచన చేసిన రాజకీయవాదిగా రాజనీతిజ్ఞుడిగా వైయస్ చరిత్రలో నిలిచిపోయారు. పేదలందరిని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పేదలకు, దళితులకు భూమి పంపిణి వంటి కార్యక్రమాలను పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత వైయస్సార్ ది. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలలో నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వటం ఒక విప్లమాత్మక నిర్ణయం. అప్పట్లో ఈ నిర్ణయం దేశంలోనే చర్చనియామశమైంది. దేశానికి వ్యవసాయం వెన్నుముక అనే విషయం గుర్తించి వ్యవసాయానికి సాగునీరు ప్రధానమని జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తనను నమ్ముకున్న వారిని , ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎలాంటి త్యాగానికైనా ఆయన సిద్ధపడేవారు.

నాయకుడు అవసరం లేని సమాజాన్ని సృష్టించడమే గొప్ప నాయకుడు లక్షణం అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాటను తన పరిపాలనలో ఆచరణలో చేసి చూపించిన గొప్ప నేత కాబట్టే ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారు. తాత్విక చింతన కలిగిన వ్యక్తిగా రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజలకు ఏదో చేయాలని తపన పడే మానవత్వం ఉన్న మనిషి వైయస్సార్. ఎంబిబిఎస్ అయిన వెంటనే పులివెందుల వాసులకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి పేరున వైద్యశాలను ప్రారంభించి కేవలం ఒక రూపాయితో వైద్యం చేయాలని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు. గుల్బర్గా లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తన సహచరులు అనుచరులకు వెన్నుదన్నుగా నిలిచి రాజకీయాల్లో అప్పటివరకు ఎవరు నలగనంతగా కష్టాలకు నష్టాలకు నలిగినటువంటి మహా మనిషి. తాను ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించే వారు. అసలు కాంగ్రెస్ బతకదు కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు అన్నటువంటి ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబును అందరూ పనిగట్టుకొని ఉమ్మడిగా ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు తన అసమానమైన ప్రతిభతో మండుటెండలో ప్రాణాలను ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా మండుటెండలో 1475 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్రలో నిలిచారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా సీల్డ్ కవర్ ద్వారా కాకుండా శాసనసభ్యులతో ఎన్నుకోబడిన మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. సీఎం అయిన మరుక్షణమే అన్న మాటకు కట్టుబడి రైతులకు ప్రకటించిన ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి తన విశ్వతనీయతను చాటుకున్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104 సేవలు, ఇందిరమ్మ ఇల్లు, పేదలకు కార్పొరేట్ వైద్య సదుపాయాలు వరకు అన్ని సౌకర్యాలను ఉచితంగా పేదవారి ఇంటికి చేర్చి ప్రతి పేదవాడి గుండెకు వైయస్ దగ్గరయ్యారు. ఆయన రాజకీయాల్లో ప్రదర్శించిన హుందాతనం నేటితరం రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తుంది. తెల్లని దుస్తులతో ఉండే ఆయన మనస్సు కూడా స్వచ్ఛంగా వెన్నెల లా ఉండేది. అటువంటి ఆహ్లాదకరమైన రాజకీయ వాతావరణం నేర్పిన ఆ మహానేతకు 13వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

