మంత్రుల నివాసాల్లో సీబీఐ సోదాలు
భారత్ యాత్రకు గురువారం శ్రీకారం చుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు తన సొంత రాష్ట్రంలోనే సీబీఐ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు మంత్రులు, పార్టీ కీలక నేతలు, అధికారుల నివాసాల్లో సీబీఐ అధికారులు ఉదయమే సోదాలు ప్రారంభించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణను ప్రారంభించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సిసోడియా నివాసంతో సహా 7 రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

నూతన ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు..
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన ఎక్సైజ్ పాలసీలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. ఈ పాలసీని ఆమోదించే క్రమంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, ముడుపులు చేతులు మారాయని వార్తలొచ్చాయి. తన నివాసంలో సీబీఐ సోదాలు జరుపుతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలో విద్య, వైద్య వ్యవస్థలను ఉన్నతంగా తీర్చి దిద్దినందుకే కేంద్రం తమపై కక్ష కట్టిందని, సమాజానికి, ప్రజలకు మంచి చేయాలనుకునే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు సర్వసాధారణమయ్యాయని విమర్శించారు. సీబీఐ దాడులకు తాను పూర్తిగా సహకరిస్తానని, గతంలో మాదిరిగానే తాను నిజాయితీగా బయట పడతానంటూ సిసోడియా వరుస ట్వీట్లు చేశారు. ఢిల్లీలో విద్య, వైద్య ప్రమాణాలను పెంచడం, పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు.

ఢిల్లీ విద్యపై న్యూయార్క్ టైమ్స్‌లో కథనం
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అందిస్తున్న ఉత్తమ విద్యా విధానాన్ని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రశంసించింది. దీనిపై ఆ పత్రిక మొదటి పేజీలో ఓ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. మనీష్ సిసోడియా ఓ విద్యార్థినితో మాట్లాడుతున్న ఫొటోను సైతం ప్రచురించింది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ట్విటర్లో పోస్ట్ చేసిన అరగంటలోనే సీబీఐ దాడులు జరగడం విశేషం.