డోలో వెయ్యి కోట్ల కథ తెలిస్తే మైండ్ బ్లాంక్
జ్వరం వచ్చినా, ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా మనందరికి వెంటనే గుర్తుకు వచ్చేది డోల్ 650. డోల్ 650 కరోనా తర్వాత తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే డోల్ 650 గురించి సుప్రీం కోర్టుకు అందించిన వివరాలు ఎవరినైనా షాక్‌కు గురిచేస్తాయ్. కంపెనీ ఆరంభంలో డోలో మెడిసిన్ రాయాల్సిందిగా దేశ వ్యాప్తంగా వైద్యులు, సంస్థలకు వెయ్యి కోట్ల రూపాయలు పంచిపెట్టినట్టు జరుగుతున్న ప్రచారం సంచలనం కలిగిస్తోంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమంటూ సుప్రీం కోర్టు జడ్జిలు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న వ్యాఖ్యానించారు.

ఫార్మా కంపెనీలు తమ రూపొందించిన మెడిసిన్ ప్రచారం కోసం చేసే ఎలాంటి చర్యలైనా ఆమోదయోగ్యంగా ఉండాలంటూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. మొత్తం వ్యవహారంపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు కేంద్రాన్ని కోరారు. వ్యక్తిగతంగా కరోనా వచ్చిన సమయంలో డోల్ 650 రిఫర్ చేశారని… ఇలాంటి విషయాలు చాలా ఆందోళన కలిగించేవన్నారు చంద్రచూడ్. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఫెడరేషన్ తరపున వాదనలు విన్పించిన సంజయ్ పరేక్… డోల్ వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయాన్ని వివరించారు. బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ సంస్థపై ఐటీ అధికారులు 36 చోట్ల సోదాలు నిర్వహించారు. 300 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని అధికారులు నిర్ధించారు.

ఇలా ఉచితాలు ఇచ్చి వైద్యులను పూర్తి స్థాయిలో ప్రభావితం చేయడం వల్ల వారు.. రోగులకు పెద్ద ఎత్తున మెడిసిన్ ఇవ్వడం వల్ల చెడు ఫలితాలు వస్తున్నాయని… రోగుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయని పిటిషన్‌దారు చెప్పారు. ఓవైపు కోవిడ్‌తో జనం చస్తున్నా… ఇదే తరహాలో ఫార్మా కంపెనీలు వ్యవహరించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై మానిటరింగ్ మెకానిజం, పారదర్శకత, జవాబుదారీతనం అందించి… యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ప్రభావవంతంగా ఉండేలా చూడాలని పిటిషన్‌దారు అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 29న కోర్టు ముందుకు రానుంది.