NationalNews

కశ్మీర్‌లో నాన్‌ లోకల్స్‌కు ఓటు హక్కు

వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఇందుకోసం ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణలు చేయిస్తోంది. మరోవైపు.. ఈ జాబితాలో స్థానికేతరులకు భారీ ఎత్తున ఓటర్లుగా చేర్చడం వివాదాస్పదంగా మారింది. వచ్చే ఎన్నికల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

స్థానికేతరులు ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నామని జమ్మూ కాశ్మీర్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ హిర్దేష్‌ కుమార్‌ తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 76 లక్షల మంది ఓటర్లకు అదనంగా మూడో వంతు కంటే ఎక్కువ ఓటర్ల సంఖ్య పెరగవచ్చని అంచనా.

కేంద్రం అవలంబిస్తున్న చర్యలను స్థానిక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ఎన్నికల్లో ప్రభావితం చేయడానికి ఇదో ప్రమాదకరమైన చర్య అని అభివర్ణించారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.