బెంగాల్‌లో మరో షిండే..! బీజేపీతో కలిసి అధికారానికి ప్లాన్
పశ్చిమ బెంగాల్‌లో మరో షిండే సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి.. బీజేపీతో కలిసి ఏక్‌నాథ్ షిండే అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు బెంగాల్‌లోనూ అలాంటి ఆపరేషన్‌కు తృణమూల్ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ప్లాన్ రూపొందిస్తున్నారు. దీంతో ఒకప్పుడు ఎర్ర జెండాకు కంచు కోట అయిన బెంగాల్‌లో త్వరలో కాషాయ జెండాను రెపరెపలాడే సూచనలు కనబడుతున్నాయి. టీఎంసీకి చెందిన అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులు తమను తాము కాపాడుకునేందుకు బీజేపీ శరణు వేడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. మంత్రి సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఇంటి నుంచి రూ.21 కోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో మరో ఇద్దరు మంత్రులు ఫిర్మాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇలా వెతుక్కుంటూ వెళ్తే అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలకు బెంగాల్‌లో కొదవే లేదు. వాళ్లే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలికను తీసుకొచ్చి.. మహారాష్ట్రలో మాదిరిగా బీజేపీతో కలిసి అధికారం చేపట్టేందుకు ఉవ్వీళ్లూరుతున్నారు. కావాల్సిందల్లా బీజేపీ చొరవ చూపించి.. వారికి అభయ హస్తం అందించడమే.

మమతా బెనర్జీ అధికార నివాసానికి సమీపంలో ఇటీవల కొత్త బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. టీఎంసీ కంచుకోట అయిన హజ్రాతో పాటు పలు ప్రాంతాల్లోనూ ఈ పోస్టర్లు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రజలు కోరుకుంటున్నట్లే 6 నెలల్లో కొత్త టీఎంసీ ప్రభుత్వం వస్తుందన్నది ఆ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీల సారాంశం. అందులో టీఎంసీ లోగో, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఉంది. కానీ మమతా బెనర్జీ ఫొటో మాత్రం లేదు. అభిషేక్ బెనర్జీ ఫొటో మాత్రం ఉంది. దీన్నిబట్టి మమత ప్రమేయం లేకుండానే ఆ పోస్టర్లు వెలిశాయని తెలుస్తోంది. అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో టీఎంసీని చీల్చి.. బీజేపీతో కలిసి అధికారం చేపట్టాలన్నది ఈ ఆపరేషన్ లక్ష్యం.

తాను సీఎంగా.. బీజేపీకి చెందిన సువేందు అధికారి డిప్యూటీ సీఎంగా బెంగాల్‌లో పాగా వేయాలని అభిషేక్ పకడ్బందీ వ్యూహాన్ని రూపోందించినట్లు ఇటీవలి పరిణామాలను బట్టి తెలుస్తోంది. అయితే.. దీనికి ఆయన భారీ కసరత్తే చేయాల్సి ఉంది. 294 మంది ఎమ్మెల్యేలున్న బెంగాల్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 147 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. బీజేపీకి ఇప్పటికే 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అభిషేక్ బెనర్జీ కనీసం 70 మంది టీఎంసీ ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకోగలిగితేనే ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అవినీతిలో కూరుకుపోయిన టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో చేతులు కలుపుతారనే ఆశతో అభిషేక్ ఉన్నారు.
బెంగాల్ అసెంబ్లీలో వివిధ పార్టీల బలాలు
తృణమూల్ కాంగ్రెస్… 213
భారతీయ జనతా పార్టీ… 77
కాంగ్రెస్…. 0
సీపీఎం… 0
ఇతరులు… 2

