NewsTelangana

వాసవి రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌పై ఐటీ దాడులు

వాసవి కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ కార్యాలయాలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై బుధవారం హైదరాబాద్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆ సంస్థ కార్యాలయాల్లో 10 చోట్ల ఐటీ శాఖ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో 20 మందితో కూడిన ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో సంస్థ ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీకి చెందిన వాసవి రియల్టీ, వాసవి నిర్మాణ్‌, శ్రీముఖ్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, ఇండ్‌మాక్స్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌, వాసవి వెంచర్స్‌కు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో భారీ రియాల్టీ వెంచర్లు, హౌసింగ్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్న వాసవి రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆదాయపు పన్నును మాత్రం ఆ స్థాయిలో చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతోందని ఐటీ శాఖకు పక్కా సమాచారం అందింది. దీంతో అక్రమ లావాదేవీలు, ఇప్పటి వరకు పూర్తయిన వాసవీ గ్రూప్‌ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.