జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి
భారత దేశాన్ని మతం, కులం పేరు మీద చాలా నీచమైన రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతుందని, ఇది ఏ రకంగా మంచిది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభలో మాట్లాడుతూ… మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు గతంలో రూ. 5 కోట్ల చొప్పున నిధులు కేటాయించామని, వాటికి అదనంగా మరో రూ. 10 కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నానని సీఎం తెలిపారు. భారతదేశంలో అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ ఉంది. అవినీతి రహిత పాలన వల్లే ఇది సాధ్యమైంది. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి. విచ్ఛిన్న శక్తులు, ప్రతీప శక్తులు, దుర్మార్గులు, నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ ప్రజలు అప్రమత్తంగా, తెలివిగా ఉండాలి. దేశంలో జరిగే పరిణామాలపై గ్రామాల్లో, బస్తీల్లో చర్చ జరగాలి. నిజమేందో? అబద్ధమేందో తెలుసుకొని జాగ్రత్తగా ఉంటేనే… మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 58 ఏళ్లు దగా పడ్డాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మన వనరులు కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాలని అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, కిడ్నీ బాధితులకు పింఛన్లు అందిస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా నీటి కొరత తీర్చుకున్నాం. కరోనా రాకుంటే మరో 500 గురుకులాలు ఏర్పాటు చేసే వాళ్లం. మేడ్చల్ జిల్లాలో మంజూరు చేసిన రూ. 70 కోట్లు శాసన సభ్యుల పేదల కోసం, ప్రజల కోసం వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.