బాలీవుడ్ నటికి ఈడీ షాక్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారీ కుంభకోణంలో ఇరుక్కుంది. వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో నేరస్థుడు సుఖేశ్ చంద్రశేఖర్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు ఈడీ విచారణలో వెల్లడైన విషయం విదితమే. 32 క్రిమినల్ కేసుల్లో సుఖేశ్ చంద్రశేఖర్‌ను పలు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించారు. ఢిల్లీకి చెందిన శివిందర్ సింగ్ వ్యాపారి భార్య అదితి సింగ్ నుంచి రూ. 215 కోట్లకు దోపిడీ చేసిన కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ అరెస్ట్ చేశారు. వారి వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రూ. 215 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సైతం నిందితురాలిగా ఈడీ చేర్చింది. ఆమెకు వ్యతిరేకంగా ఛార్జ్‌షీటును కోర్టులో దాఖలు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్టు గతంలో విచారణ సందర్భంగా జాక్వెలిన్ అంగీకరించింది. సుమారు రూ. 10 కోట్ల బహుమతులను జాక్వెలిన్‌కు సుఖేశ్ పంపించినట్టు ఈడీ గుర్తించింది. ఆమెకు చెందిన 7 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. సుఖేశ్ దోపిడీ చేసిన మొత్తానికి లబ్ధిదారు ఆమెనేని గుర్తించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.

సుఖేశ్ చంద్రశేఖర్‌తో రిలేషన్‌షిప్ కొనసాగించడం మీడియాలో చర్చనీయాంశమైంది. జాక్వెలిన్‌కు ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను సుఖేశ్ గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా చర్చకు దారి తీసింది. జాక్వెలిన్, సుఖేశ్ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరి మధ్య సంబంధాలకు ఆధారాలు లభించాయి. ప్రస్తుతం ఈ వార్త నేషనల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఆమె పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

