NationalNews

వ్యవస్థ మారలేదు.. కుల ముసుగు తొలగలేదు

సమాజం ఎంతగా మారుతున్నా.. ఆధునికత ఎంతగా చోటు చేసుకుంటున్నా కుల దురహంకారం మాత్రం ఇంకా కొమ్ములు విసరడం శోచనీయమని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్ధాన్ లోని జాలోర్ జిల్లాలో జరిగిన ఓ సంఘటనపై ఆమె కలత చెందారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ళ దళిత బాలుడు మంచినీళ్ళ కుండను తాకాడన్న కారణంగా టీచర్ చితకబాదారు. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడగా ,అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ టీచర్ కొట్టిన దెబ్బలకు ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ ఘటనపై స్పందించిన మీరాకుమార్ .. తన బాల్య స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. తన తండ్రి బాబూ జగ్జీవన్ రామ్‌ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారేని అన్నారు. ప్రస్తుతం జరిగిన సంఘటన చూస్తే అప్పటి తన తండ్రి ఎదుర్కొన్న వైనం గుర్తుకు వస్తోందని మీరా కుమార్ అన్నారు.

దేశ స్వాతంత్రం కోసం పోరాడి , ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తన తండ్రి బాబూ జగ్జీవన్ రామ్ ను ఇప్పటికీ ఓ దళిత వ్యక్తి గానే సంబోధించడంపై మీరాకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు దాటినా కుల వ్యవస్థ ఇంకా ప్రధాన శత్రువుగానే ఉందని అన్నారు. దళితులు ఇప్పటికీ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో తాను ఇల్లు అద్దె కోసం ప్రయత్నించినప్పుడు కూడా చాలా మంది కుల ప్రస్తావన తీసుకొచ్చి ఇల్లు అద్దెకు ఇవ్వలేదని గుర్తుచేసుకున్నారు. జాలోర్ ఘటన రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ శాసన సభ్యుడు మేఘ్‌వాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతిస్తూ జాలోర్ మున్సిపల్ కౌన్సిల్‌లో హస్తం పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు కూడా రాజీనామాలు సమర్పించారు. అసలే కాంగ్రెస్ పరిస్ధితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఈ ఘటన అటు అశోక్ గెహ్లాత్ ను.. ఇటు కాంగ్రెస్ ను చిక్కుల్లోకి నెట్టింది.