బెంగాల్ లో మరో మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్లో, ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థిని పై అత్యాచారం సంచలనం రేపుతోంది. గతంలో కోల్కతాలోని ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఓ జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనను మరిచిపోకముందే మరో వైద్య విద్యార్థినికి ఇలా జరగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఒడిశా రాష్ట్రానికి చెందిన MBBS రెండో సంవత్సరం విద్యార్థిని, శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ బయట డిన్నర్ తినేందుకు వెళ్లింది. అయితే, కొంతమంది యువకులు వారిని అనుసరించి, స్నేహితుడిని భయపెట్టి పారిపోయేలా చేశారు. ఆమె ఒంటరిగా మిగలడంతో ఆ యువకులు ఆమెను సమీప అడవిలోకి తీసుకెళ్లి, అత్యాచారం చేశారు. అతర్వాత ఆమె మొబైల్ ఫోన్ ను కూడా లాక్కున్నారు. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని తల్లిదండ్రులు దుర్గాపూర్ కాలేజీకి చేరుకుని, తమ కుమార్తెకు న్యాయం చేయాలని కోరారు. వారు కాలేజీ క్యాంపస్ లో భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సమాచారం. ఈ తాజా సంఘటన కూడా విద్యార్థినుల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.