తిరుపతిలో బిగ్ అలర్ట్.. వరుస బాంబుబెదిరింపు మెయిల్స్
టెంపుల్ సిటీ తిరుపతికి గత ఏడాదిగా వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. గత కొంత కాలంగా ఫేక్ మెయిల్స్ అలెర్ట్స్ తో వెంకన్న భక్తులు యాత్రికుల్లో ఆందోళన నెలకొంది. ఈ వరసగా వస్తున్న మెయిల్స్ పోలీసులకు సవాలు గా మారాయి. ఎయిర్ పోర్టుతో మొదలైన బాంబు బెదిరింపు మెయిల్స్ హోటల్స్, ఆలయాలకు కూడా వస్తుండడంతో నగరం అంతటా అలజడి నెలకొంది. గతంలో ఎక్స్ అకౌంట్ నుంచి ఎయిర్ పోర్టుకు బెదిరింపు రాగా ఆ తర్వాత పలు హోటల్స్ బ్లాస్ట్ చేస్తామంటూ ఇమెయిల్స్ వచ్చాయి. దేవాలయాలకు సైతం అదే తరహా థ్రెట్ మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసు యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. థ్రెట్ మెయిల్స్ అధికం అవుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భక్తులు భయపడుతున్నారు. అసలు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏఏ అకౌంట్స్ నుంచి పోస్టు చేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ బెదిరింపులు వస్తున్న ఐడిలు, ఐపి అడ్రస్సులు సైబర్ టీం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి లోనూ ఇస్కాన్ ఆలయానికి, పలు హోటల్స్ కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ ఆందోళనకు గురి చేయగా సింధూర్ ఆపరేషన్ సమయంలో తిరుమలలో ఒక కుటుంబాన్ని బాంబు వేసి పేల్చి వేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ మేరకు అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయింది. ఇక ఈ నెల 3, 6 న తిరిగి వరుసగా పాక్, ఐసిస్ ల పేరుతో బాంబు మెయిల్స్ వచ్చాయి. ఆగని మెయిల్స్ తో తిరుమల, తిరుపతి వ్యాప్తంగా బిగ్ అలర్ట్ నెలకొంది.