Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

ప్యాలెస్‌లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్‌కి తెలుసు

అనంతపురం :ప్యాలెస్‌లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్‌కి తెలుసు అని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. జగన్‌కి మానసిక పరిస్థితి బాలేదని మంత్రి విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదివారం అనంతపురం పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి సత్య కుమార్ వ్యాఖ్యానిస్తూ, కూటమి ప్రభుత్వానికి భయపడి జగన్ ప్రజల మధ్యకు రావడానికి వెనుకాడుతున్నారని, ప్యాలెస్‌కే పరిమితమైపోయారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సంబంధం లేకుండా, కేవలం రాజకీయ లాభం కోసమే జగన్ దండయాత్రలు చేస్తారని ఆరోపించారు.
“ప్రజలపై దాడులు చేయడం, తలకాయలు నరకడం, తలకాయలు తొక్కించటం, రప్ప రప్ప అనటం… ఇవే జగన్ నిజ స్వభావాన్ని చూపిస్తున్నాయి” అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విష సంస్కృతిని అలవరుచుకున్న పార్టీ వైసీపీ అని మంత్రి ధ్వజమెత్తారు.వైసీపీ నేతలు ప్రజలను బెదిరించినా, భయపడే వారు ఎవరూ లేరని సత్య కుమార్ స్పష్టం చేశారు. “ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి, అధికారంలోకి వస్తే అంతు చూస్తాం అంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. కానీ, ఇక వైసీపీ అధికారంలోకి రావడం సాధ్యం కాదు, సచ్చేది లేదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
“ప్యాలెస్‌లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్‌కి తెలుసు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారు. అలాగే, 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా వైసీపీ చేతిలో నిలవవని స్పష్టం చేశారు. వైసీపీ డిజిటల్ బుక్‌పై కూడా మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, ఆ పుస్తకం వాస్తవాలపై కాకుండా మాయాజాలం, తప్పుడు ప్రచారంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.