రీల్స్ చూడటం ఆపీ,పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టండి
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన రీల్స్ షేర్ చేసిన వీడియో నేపథ్యంలో రేఖా గుప్తా చురకల వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేజ్రీవాల్ సామాజిక మాధ్యమంలో ఎడిటెడ్ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రేఖా గుప్తా మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ బస్ డిపోకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నేను కేజ్రీవాల్ కు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి. కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టాలి. అత్యంత ఘోరమైన వరద విపత్తు నేపథ్యంలో బాధితులను ఆయన పరామర్శించలేదని గమనించండి” అని అన్నారు. అంతేకాక, రేఖా గుప్తా కేజ్రివాల్ ను 11 సంవత్సరాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రజలు కష్టపడుతున్నారని ఆరోపించారు. “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించినందుకు మీరు సిగ్గుపడాలి” అని గుప్తా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా ఆమె ఘాటైన విమర్శలు చేశారు. “కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజల తీర్పు, మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా? ఈ ఫార్ములా ఎక్కడ రాసింది? రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే” అని రేఖా గుప్తా పేర్కొన్నారు.